శరీరానికి ప్రొటీన్లు, ఫైబర్ ఎంత అవసరమో.. నీరు కూడా అంతే కీలకం. సాధారణంగా రోజుకు సుమారు 2.7 నుంచి 3 లీటర్ల వరకు నీరు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే బిజీ జీవనశైలి, దాహం అనిపించకపోవడం వంటి కారణాలతో చాలామంది తగినంత నీరు తాగడం మర్చిపోతుంటారు. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. శరీరంలో నీటి కొరత ఏర్పడితే గుండెపై కూడా ప్రభావం పడవచ్చని ఢిల్లీలోని ధర్మశిల నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్, హెడ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ నాయక్ తెలిపారు. డీహైడ్రేషన్ సమయంలో రక్త పరిమాణం తగ్గడం వల్ల గుండె శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని పంపేందుకు సాధారణం కంటే వేగంగా కొట్టుకోవాల్సి రావచ్చని ఆయన వివరించారు.

శరీరంలో నీటి స్థాయి తగ్గినప్పుడు కేవలం దాహం, నోరు పొడిబారడం మాత్రమే కాకుండా రక్త ప్రసరణపై కూడా ప్రభావం పడొచ్చు. తగినంత నీరు లేకపోతే రక్త పరిమాణం తగ్గే అవకాశం ఉండటంతో, శరీరంలోని అవయవాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా కొనసాగించేందుకు గుండె కొంత వేగంగా కొట్టుకోవాల్సి రావచ్చు. ముఖ్యంగా వ్యాయామం, అధిక వేడి లేదా తేమ ఉన్న వాతావరణంలో ఎక్కువగా చెమట పట్టడం, అలాగే వాంతులు, విరేచనాల వల్ల ద్రవాలు కోల్పోవడం డీహైడ్రేషన్‌కు కారణమవుతాయి.
డీహైడ్రేషన్‌కు సాధారణ సంకేతాల్లో తీవ్రమైన దాహం, నోరు పొడిబారడం, ముదురు రంగులో మూత్రం రావడం లేదా సాధారణం కంటే తక్కువగా మూత్ర విసర్జన చేయడం, తలనొప్పి, అలసట, బలహీనత, నిలబడినప్పుడు తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి ఉండవచ్చు. అయితే ఇవే లక్షణాలు ఇతర ఆరోగ్య సమస్యల్లోనూ కనిపించవచ్చు. కాబట్టి గుండె వేగం పెరిగిందంటే దానికి డీహైడ్రేషన్ మాత్రమే కారణమని భావించకూడదు.
ఎక్కువసేపు ఎండలో లేదా వేడి వాతావరణంలో ఉండేవారు, వ్యాయామం చేసేవారు, జ్వరం, వాంతులు లేదా విరేచనాలతో బాధపడేవారు, వృద్ధులు, కొన్ని రకాల మందులు ఉపయోగించేవారు డీహైడ్రేషన్‌కు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. ద్రవ నష్టం జరిగినప్పుడు చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటూ నెమ్మదిగా నీరు తాగడం సహాయపడుతుంది. ఎక్కువగా చెమట పట్టడం లేదా వాంతులు, విరేచనాల కారణంగా ద్రవాలు కోల్పోతే వైద్యుల సూచన మేరకు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) ఉపయోగించవచ్చు.
నీరు, ద్రవాలు తీసుకున్న తర్వాత కూడా గుండె వేగంగా కొట్టుకోవడం కొనసాగితే, లేదా ఛాతీ నొప్పి, తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూర్ఛ వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. గుండె దడకు డీహైడ్రేషన్‌తో పాటు రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు, కొన్ని మందులు లేదా ఇతర గుండె సంబంధిత సమస్యలు కూడా కారణం కావచ్చు. ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే; వ్యక్తిగత వైద్య సలహా కోసం వైద్యుడిని సంప్రదించాలి.
