భార్య మూరెడు మల్లెపూలు అడిగితేనే పెద్దగా పట్టించుకోని భర్తలు ఎంతోమంది ఉంటారు. కానీ, తన భార్యకు పూలంటే ఎంత ఇష్టమో గుర్తించి, ఆమెకు ఇష్టమైన పూలతోటను సొంతంగా పెంచిన ఓ భర్త ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. భార్య మానసికంగా కుంగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆమెకు నచ్చిన పూలతోటను పెంచేందుకు ఏకంగా రెండేళ్ల పాటు శ్రమించాడు. ప్రేమ, శ్రద్ధ ఉంటే జీవిత భాగస్వామి కోసం ఎంత కష్టమైనా చేయొచ్చని తన చర్యతో చాటిచెప్పాడు.

భార్య చిన్న కోరికను కూడా పట్టించుకోకుండా లైట్ తీసుకునే భర్తలు ఎంతోమంది ఉంటారు. కానీ తన భార్య ఇష్టపడే పూలను చూసి సంతోషించాలనే కోరికను నెరవేర్చేందుకు ఓ భర్త ఏకంగా రెండేళ్ల పాటు శ్రమించి అందమైన పూలతోటను పెంచాడు. ఆమె డిప్రెషన్లోకి వెళ్తోందని తెలుసుకున్న అతడు, ఆమెకు ఇష్టమైన పూలతోటను స్వయంగా తీర్చిదిద్దాడు. చివరకు ఆమె ఆ పూలను చూడలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఆమెను బాధ నుంచి బయటకు తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. భార్యపై తనకున్న ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన ఈ భర్త కథ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
జపాన్‌కు చెందిన తోషియుకి కురోకి, ఆయన భార్య యసుకో కలిసి డెయిరీఫామ్ నిర్వహించేవారు. అయితే 52 ఏళ్ల వయసులో మధుమేహం కారణంగా యసుకో చూపు కోల్పోయారు. దీంతో ఆమె తీవ్ర నిరాశకు లోనై ఇంటి నుంచి బయటకు రావడం కూడా పూర్తిగా మానేశారు. భార్యలో ఆ బాధను పోగొట్టి, మళ్లీ ఆమెను బయట ప్రపంచంలోకి తీసుకురావాలని కురోకి నిర్ణయించుకున్నారు.
అందుకోసం ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో సువాసనలు వెదజల్లే గులాబీ రంగు పూలతోటను పెంచడం ప్రారంభించారు. ఏళ్ల తరబడి ఎంతో శ్రమించి వేలాది పూలను పెంచారు. యసుకో వాటిని చూడలేకపోయినా.. ఆ పూల పరిమళం ఆమెను ఇంటి బయటకు అడుగుపెట్టేలా చేసింది.
అంతేకాదు, ఆ అందమైన పూలతోటను చూసేందుకు, కురోకి దంపతులను కలిసేందుకు ఎంతోమంది సందర్శకులు రావడం మొదలైంది. దీంతో యసుకో ఒంటరితనం, బాధ క్రమంగా తగ్గిపోయాయి. భార్యను మళ్లీ ఆనందంగా చూడాలనే ఉద్దేశంతో కురోకి చేసిన ఈ ప్రయత్నం ఎంతోమందిని కదిలించింది. ఆ పూలతోట కేవలం అందం కోసం కాదు.. తన భార్యకు ఆనందం, ప్రశాంతత, మరపురాని క్షణాలను అందించాలనే ప్రేమకు ప్రతీకగా నిలిచింది.
