
స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టే కొత్త కంపెనీలపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా ప్రముఖ సంస్థల ఐపీఓలకు భారీ స్పందన లభిస్తుంటుంది. ఈ క్రమంలో హాస్పిటాలిటీ, ట్రావెల్ టెక్నాలజీ రంగాల్లో సేవలందిస్తున్న ఓయో మాతృసంస్థ ఒరావెల్ స్టేస్ మరోసారి పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోంది. తన కార్పొరేట్ బ్రాండ్ పేరును ప్రిజమ్‌గా మార్చుకున్నప్పటికీ, ఐపీఓ పత్రాల్లో మాత్రం ఒరావెల్ స్టేస్ పేరునే కొనసాగిస్తోంది.
ఇప్పటికే 2021, 2024లో ఐపీఓకు ప్రయత్నించి వెనక్కి తగ్గిన ఈ సంస్థ.. ఇప్పుడు మూడోసారి మార్కెట్లోకి రావాలని భావిస్తోంది. రితేష్ అగర్వాల్ నేతృత్వంలోని కంపెనీ 2027 జనవరి-మార్చి త్రైమాసికంలో ఐపీఓను ప్రారంభించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
రూ.20 వేల కోట్లకు పైగా వాల్యుయేషన్ అంచనా
ఓయో ఐపీఓకు ఈ ఏడాది జూన్‌లో సెబీ ఆమోదం లభించింది. అంతకుముందు 2025 డిసెంబరులో కంపెనీ రహస్య మార్గంలో ముసాయిదా పత్రాలను సమర్పించింది. అనంతరం జూన్‌లో సవరించిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయగా అనుమతి వచ్చింది.
ఆ సమయంలో కంపెనీ విలువను రూ.45 వేల కోట్ల నుంచి రూ.46 వేల కోట్ల వరకు అంచనా వేశారు. తొలుత రూ.6,650 కోట్లుగా భావించిన ఐపీఓ పరిమాణాన్ని తర్వాత రూ.3,350 కోట్లకు తగ్గించింది. అయితే మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పబ్లిక్ ఇష్యూను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు కంపెనీ వాల్యుయేషన్ మరింత తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుత ఐపీఓ పరిమాణాన్ని బట్టి సంస్థ విలువ రూ.20 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల మధ్య ఉండవచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి.
పూర్తిగా ఫ్రెష్ ఇష్యూగానే ఐపీఓ
ఈసారి ఒరావెల్ స్టేస్ ఐపీఓ పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ రూపంలోనే రానున్నట్లు సమాచారం. అంటే కొత్త షేర్లను జారీ చేసి కంపెనీ నిధులు సమీకరించనుంది. ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించే అవకాశం ప్రస్తుతానికి లేదని తెలుస్తోంది. దీంతో ఈ ఇష్యూలో ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉండకపోవచ్చు.
రాబోయే వారాల్లో సవరించిన ముసాయిదా పత్రాలను కంపెనీ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఐపీఓకు సంబంధించిన ధరల శ్రేణి, తుది వాల్యుయేషన్, ఇతర కీలక వివరాలు ఇష్యూ ప్రారంభానికి దగ్గరగా వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ పబ్లిక్ ఇష్యూ ప్రక్రియలో యాక్సిస్ క్యాపిటల్, సిటీ, ఇన్‌క్రెడ్ క్యాపిటల్, గోల్డ్‌మన్ శాక్స్, ఇంటెన్సివ్ ఫిస్కల్ సర్వీసెస్, జేఎం ఫైనాన్షియల్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి.
గతంలో రెండుసార్లు వెనక్కి తగ్గిన ఓయో
ఒరావెల్ స్టేస్ తొలిసారిగా 2021 సెప్టెంబరులో ఐపీఓకు దరఖాస్తు చేసింది. అప్పట్లో ఇష్యూ పరిమాణాన్ని రూ.8,430 కోట్లుగా అంచనా వేసింది. అయితే 2022 డిసెంబరులో సెబీ ముసాయిదా పత్రాలను తిరిగి పంపి, తాజా ఆర్థిక వివరాలతో కొత్తగా దాఖలు చేయాలని సూచించింది.
దీంతో 2023 మార్చిలో తగ్గించిన ఐపీఓ పరిమాణంతో మరోసారి దరఖాస్తు చేసింది. అయినప్పటికీ 2024 మేలో కంపెనీ తన ఫైలింగ్‌ను ఉపసంహరించుకుంది. ఇప్పుడు మూడో ప్రయత్నంగా ఐపీఓకు రావాలని చూస్తోంది.
ఓయో తాజా ప్రయత్నం విజయవంతమైతే భారత హాస్పిటాలిటీ రంగంలో మరో ప్రముఖ సంస్థ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించినట్లవుతుంది. అయితే ఐపీఓ తేదీలు, ధర, తుది వాల్యుయేషన్ వంటి అంశాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.



