
బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నాణ్యతపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) చేసిన ప్రకటనపై కంపెనీ స్పందించింది. తమ నీరు సురక్షితమైనదేనని స్పష్టం చేసింది. వినియోగదారులకు నాణ్యమైన తాగునీటిని అందించడమే తమ ప్రాధాన్యమని, తయారీ ప్రక్రియలో కఠినమైన నాణ్యతా ప్రమాణాలను అనుసరిస్తున్నామని వెల్లడించింది. ఈ వ్యవహారంలో FSSAI నిర్వహించే విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపింది.
90కి పైగా నాణ్యత పరీక్షలు
తమ తయారీ ప్రక్రియలో మొత్తం 10 దశలు ఉంటాయని, ప్రతి దశలోనూ నాణ్యతను పరిశీలిస్తామని బిస్లరీ పేర్కొంది. ఉత్పత్తులపై 90కి పైగా పరీక్షలు నిర్వహించిన తర్వాతే మార్కెట్లోకి విడుదల చేస్తామని వివరించింది. దశాబ్దాలుగా వినియోగదారుల నమ్మకాన్ని పొందిన తమ బ్రాండ్ నీటి భద్రత విషయంలో రాజీ పడదని కంపెనీ ప్రకటనలో తెలిపింది.
14 నెలల క్రితం తయారైన బ్యాచ్‌పై పరీక్షలు
FSSAI అధికారులు పరీక్షించిన నీటి నమూనాలు సుమారు 14 నెలల క్రితం గోవాలోని తమ తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేసిన బ్యాచ్‌కు చెందినవని బిస్లరీ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్ 30న గోవా ప్లాంట్ నుంచి అధికారులు ఆరు నమూనాలను సేకరించినట్లు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న స్వతంత్ర పరీక్షల నివేదికలతో పాటు అధికారిక లేఖను FSSAI కార్యాలయానికి సమర్పించామని పేర్కొంది.
అయితే నాణ్యతకు సంబంధించి తమకు ఎలాంటి అధికారిక నోటీసు అందలేదని, దీంతో ఈ అంశం ముగిసిందని భావించినట్లు కంపెనీ వివరించింది.
బ్రోమేట్, ఇతర రసాయనాలపై అభ్యంతరాలు
ఇటీవల బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలను FSSAI పరీక్షించగా, నిర్ణీత పరిమితికి మించి బ్రోమేట్ ఉన్నట్లు గుర్తించింది. నీటి శుద్ధి ప్రక్రియలో ఓజోన్ వాయువును ఉపయోగించినప్పుడు నీటిలోని కొన్ని పదార్థాలతో చర్య జరిగి బ్రోమేట్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రసాయనం అధిక స్థాయిలో ఉండటం ఆరోగ్యపరంగా ఆందోళన కలిగించవచ్చు.
ఈ నేపథ్యంలో ఆహార భద్రతా చట్టం ప్రకారం నీటి నమూనాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవని FSSAI పేర్కొంది. దీనిపై కంపెనీ అప్పీల్ చేయడంతో మరోసారి పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో బ్రోమేట్ స్థాయులు నిర్ణీత పరిమితిలోనే ఉన్నట్లు తేలినప్పటికీ, పాలీ న్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.
ఈ పదార్థాలు విషపూరిత స్వభావం కలిగినవిగా పరిగణించడంతో బిస్లరీపై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టేందుకు FSSAI అనుమతి ఇచ్చింది. ఈ పరిణామాలపై కంపెనీ తన వాదనను వినిపిస్తుండగా, తదుపరి చర్యలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.



