
రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. దేశ సమగ్రత, అభివృద్ధి, ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ మరింత అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, గృహ నిర్మాణం, విద్య, వైద్యం, రహదారులు, మహిళా సంక్షేమం తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.
వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, తాగునీరు, సామాజిక భద్రత వంటి రంగాల్లో జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన జీవన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
గోదావరి పుష్కరాలు–2027కు ఏర్పాట్లు
2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రూ.2,643 కోట్లతో 1,612 పనులు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. ఇప్పటికే రూ.428 కోట్ల విలువైన 362 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు
తూర్పుగోదావరి జిల్లాను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు రూ.94.44 కోట్లతో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. హేవ్‌లాక్ బండ్ అభివృద్ధితో పాటు పుష్కర్ ఘాట్, కడియం నర్సరీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, ఇతర పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 1,000 మందికి, పరోక్షంగా మరో 8,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందన్నారు.
స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధనలో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, యువతకు ఆయన అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.

