ఆంధ్రప్రదేశ్‌లోని రాప్తాడు ప్రాంతానికి చెందిన బాలికపై జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికకు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు విజయవంతంగా ఆర్థోపెడిక్ సర్జరీ నిర్వహించారు.

బెంగళూరులో చికిత్స.. ప్రభుత్వమే వైద్య ఖర్చులు

బాలికకు అందిస్తున్న వైద్యంపై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా వివరాలు వెల్లడించారు. బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆమె వైద్య ఖర్చులను ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోందని స్పష్టం చేశారు.

పీఐసీయూకు తరలింపు.. వైద్యుల పర్యవేక్షణలో బాలిక

ఆర్థోపెడిక్ సర్జరీ విజయవంతంగా పూర్తయిన అనంతరం ప్లాస్టిక్ సర్జరీ వైద్య బృందం కూడా బాలిక ఆరోగ్య పరిస్థితిని సమీక్షించింది. ఆ తర్వాత ఆమెను పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU)కు తరలించారు. ప్రస్తుతం బాలిక క్షేమంగా ఉందని మంత్రి వెల్లడించారు.

వైద్య బృందంతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, బాలికకు అవసరమైన వైద్యంతో పాటు మానసిక సహాయం కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటామని లోకేశ్ తెలిపారు.

బాలిక కుటుంబానికి భరోసా

ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బాధితురాలికి మెరుగైన వైద్యం, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. సర్జరీ విజయవంతం కావడంతో బాలిక కుటుంబ సభ్యులు ఊరట వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

By pavan