
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. రిషభ్ పంత్ జట్టును వీడటంతో అతడి స్థానంలో నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ పేరు తెరపైకి వచ్చింది. లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి.
ఇటీవల ఢిల్లీలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా దిగ్వేశ్ రాఠీని లక్నో కొత్త కెప్టెన్ ఎవరని ప్రశ్నించారు. దీనికి అతడు నికోలస్ పూరన్ పేరు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే లక్నో యాజమాన్యం మాత్రం కొత్త కెప్టెన్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
కెప్టెన్సీ రేసులో పూరన్ ముందంజ?
2023 నుంచి లక్నో జట్టులో కొనసాగుతున్న పూరన్.. ఆ ఫ్రాంచైజీలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రూ.21 కోట్లకు అతడిని లక్నో రిటైన్ చేసుకుంది. జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ పూరన్ కొనసాగుతున్నాడు. దీంతో పంత్ స్థానంలో అతడికి కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు రిషభ్ పంత్ 2025, 2026 సీజన్లలో లక్నోకు నాయకత్వం వహించాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.27 కోట్ల భారీ ధరకు ఆ జట్టులో చేరాడు. అయితే 2026 జూన్‌లో ట్రేడ్ డీల్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లడంతో లక్నో కొత్త సారథి కోసం అన్వేషణ ప్రారంభించాల్సి వచ్చింది.
మరికొందరు కూడా రేసులో..
పూరన్‌తో పాటు పలువురు అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా లక్నో కెప్టెన్సీ రేసులో ఉన్నారు. ఆస్ట్రేలియా టీ20 జట్టుకు నాయకత్వం వహిస్తున్న మిచెల్ మార్ష్, దక్షిణాఫ్రికా టీ20 కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ పేర్లు పరిశీలనలో ఉండే అవకాశం ఉంది.
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కరన్.. 2026లో డెసర్ట్ వైపర్స్ జట్టుకు తొలి ILT20 టైటిల్ అందించడంలో నాయకత్వ పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువుకు ముందు రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ డీల్ ద్వారా లక్నో జట్టులోకి వచ్చాడు.
దిగ్వేశ్ రాఠీ వ్యాఖ్యలతో పూరన్ పేరు మరింతగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. లక్నో యాజమాన్యం అధికారికంగా ఎవరిని కెప్టెన్‌గా ప్రకటిస్తుందో చూడాలి.
