
థాయ్‌లాండ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులతో ఏపీ భవన్ అధికారులు మాట్లాడారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు విద్యార్థుల పరిస్థితిని అధికారులు తెలుసుకున్నారు. ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న సమస్యలు, తక్షణం అవసరమైన సహాయం తదితర అంశాలపై వివరాలను సేకరించారు.
విద్యార్థుల పరిస్థితికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయానికి అధికారులు పంపించారు. స్థానిక కరెన్సీ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఏపీ భవన్ అధికారులు తెలిపారు.
విద్యార్థులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఇమ్మిగ్రేషన్ అధికారులకు అవసరమైన సూచనలు ఇవ్వాలని భారత రాయబారిని ఏపీ భవన్ అధికారులు కోరారు. అలాగే విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. వారిని సురక్షితంగా భారత్‌కు తిరిగి తీసుకురావడానికి అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

