
హీరో సూర్య, మమితా బైజు జంటగా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు.
సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో మంగళవారం ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. నిర్మాతలు కేఎల్ నారాయణ, వై. రవిశంకర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తెలుగు ప్రేక్షకులతో 28 ఏళ్ల అనుబంధం
ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులతో తనకు 28 ఏళ్ల అనుబంధం ఉందని, వారి ఆదరణ వల్లే తాను ఇక్కడ ఉన్నానని తెలిపారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తనకు ఎంతో ప్రత్యేకమైన సినిమా అని చెప్పారు.
దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ కారణంగానే ఇంత అందమైన చిత్రాన్ని రూపొందించగలిగామని సూర్య పేర్కొన్నారు. త్రివిక్రమ్ ఆశీర్వాదంతో ఈ సినిమా ప్రారంభమైందని, మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఆయన ఎంతో అండగా నిలిచారని తెలిపారు.
‘గజిని’ సినిమాలో సంజయ్ రామస్వామిగా తనను తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రేమించారని గుర్తుచేసుకున్న సూర్య.. ఇప్పుడు సంజయ్ విశ్వనాథ్‌గా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చెప్పారు. అప్పటి ఎనర్జీ, మ్యాజిక్‌ను ఈ సినిమాతో మరోసారి అందించేందుకు దర్శక నిర్మాతలు ఎంతో కృషి చేశారని తెలిపారు.
కుటుంబమంతా కలిసి చూసే సినిమా
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కేవలం సూర్య అభిమానులకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా నచ్చే చిత్రమని దర్శకుడు వెంకీ అట్లూరి అన్నారు. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకుల ముఖాలపై చిరునవ్వు కనిపిస్తూనే ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హీరో సూర్య, మమితా బైజు, రాధిక శరత్ కుమార్, నిర్మాత నాగవంశీ, విజయ్ బిన్ని, హైపర్ ఆది, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 14న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ థియేటర్లలో సందడి చేయనుంది.

