
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), మహేంద్ర సింగ్ ధోనీ మధ్య ఉన్న అనుబంధం మరో కొత్త మలుపు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆటగాడిగా ఐపీఎల్‌కు వీడ్కోలు పలికి, 2027 సీజన్ నుంచి మెంటార్‌గా వ్యవహరించేందుకు సిద్ధమైన ధోనీ.. ఇప్పుడు సీఎస్కేలో యాజమాన్య వాటా కూడా పొందనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్రాంచైజీలో ఆయనకు 12 శాతం వాటా ఇచ్చేందుకు ఇరు వర్గాల మధ్య అవగాహన కుదిరినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అయితే ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
12 శాతం వాటాపై అవగాహన కుదిరిందా?
క్రిక్‌బ్లాగర్ నివేదిక ప్రకారం.. సీఎస్కే యాజమాన్యం, ధోనీ మధ్య వాటాల కొనుగోలుపై పలుమార్లు చర్చలు జరిగాయి. తొలుత ఫ్రాంచైజీలో 25 శాతం వాటా కావాలని ధోనీ కోరినట్లు సమాచారం. అయితే యాజమాన్యం కేవలం 3 శాతం వాటా ఇచ్చేందుకు ప్రతిపాదించిందట.
ఆ తర్వాత ధోనీ తన ప్రతిపాదనను 20 శాతానికి తగ్గించగా.. సీఎస్కే 4 శాతం వాటా ఇవ్వడానికి ముందుకొచ్చినట్లు నివేదిక పేర్కొంది. తదుపరి చర్చల్లో ధోనీ 18 శాతం వాటాను కోరగా, యాజమాన్యం 5.5 శాతం వరకు ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలిపింది. చివరకు ఇరు వర్గాలు మధ్యేమార్గంగా 12 శాతం వాటా విషయంలో అవగాహనకు వచ్చినట్లు వెల్లడించింది.
అయితే ఈ వాటా ద్వారా ధోనీకి ఫ్రాంచైజీ కీలక నిర్ణయాల్లో గణనీయమైన అధికారాలు ఉండకపోవచ్చని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా వాటాల కొనుగోలుకు సంబంధించిన పూర్తి చెల్లింపు కూడా ఇంకా పూర్తికాలేదని తెలిపింది. ఈ వివరాలపై సీఎస్కే నుంచి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
2008 నుంచి కొనసాగుతున్న అనుబంధం
ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం కొనసాగుతోంది. తొలి సీజన్ వేలంలో ధోనీని సీఎస్కే సుమారు 1.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆయన నిలిచాడు. అనంతరం తన నాయకత్వంతో సీఎస్కేను విజయవంతమైన జట్లలో ఒకటిగా తీర్చిదిద్దాడు.
ధోనీ కెప్టెన్సీలో చెన్నై జట్టు ఐదు ఐపీఎల్ టైటిళ్లను సాధించింది. మైదానంలో పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడం, బౌలర్లను సమర్థంగా ఉపయోగించుకోవడం, ప్రత్యర్థి జట్ల వ్యూహాలను అంచనా వేయడంలో ఆయన ప్రత్యేకత చాటుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్‌ను పవర్‌ప్లేలో కొత్త బంతితో బౌలింగ్‌కు దించడం, కీరన్ పొలార్డ్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఫీల్డింగ్ వ్యూహాలు అమలు చేయడం వంటి నిర్ణయాలు ఆయన నాయకత్వ శైలికి ఉదాహరణలుగా నిలిచాయి.
రెండేళ్ల నిషేధం వచ్చినా మారని బంధం
స్పాట్ ఫిక్సింగ్ వివాదం కారణంగా సీఎస్కే రెండేళ్ల పాటు ఐపీఎల్‌కు దూరమైనప్పుడు ధోనీ రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరఫున ఆడాడు. 2018లో చెన్నై జట్టు తిరిగి లీగ్‌లోకి వచ్చిన తర్వాత కూడా ధోనీ నాయకత్వంలో టైటిల్ సాధించింది. దీంతో ధోనీ, సీఎస్కే మధ్య అనుబంధం మరింత బలపడింది.
ఇటీవల సీఎస్కే యాజమాన్యానికి చెందిన ఎన్. శ్రీనివాసన్ కూడా ధోనీతో ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఎంఎస్ ధోనీ లేకుండా సీఎస్కే లేదు’ అని వ్యాఖ్యానించారు.
మెంటార్‌గా కొత్త బాధ్యతలు
ధోనీ 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ఐపీఎల్లో కొనసాగాడు. అయితే 2026 సీజన్లో గాయాల కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. తాజాగా ఆటగాడిగా తన ఐపీఎల్ ప్రయాణానికి ముగింపు పలికి, 2027 సీజన్ నుంచి సీఎస్కే మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.
జట్టు పునర్నిర్మాణం, యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడం వంటి అంశాల్లో ధోనీ అనుభవం ఉపయోగపడనుంది. ఈ నేపథ్యంలో 12 శాతం వాటా వార్తలు నిజమైతే సీఎస్కేతో ఆయన బంధం మైదానాన్ని దాటి యాజమాన్య స్థాయికి కూడా విస్తరించినట్లవుతుంది. అయితే ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
