
తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తల చేరికలతో మరింత బలం చేకూరుతోంది. తాజాగా తిరువూరు మండలం వావిలాల గ్రామానికి చెందిన 10 మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో వైఎస్సార్సీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ పీఏసీఎస్ చైర్మన్లు కంటేపూడి గోపాలరావు, కొమ్మినేని కిషోర్ ఉండటం విశేషం.
శుక్రవారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన నూతనంగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకూ బలోపేతమవుతోందని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలన, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసమే ఇతర పార్టీల నాయకులు టీడీపీలో చేరడానికి కారణమని పేర్కొన్నారు. వావిలాల గ్రామం నుంచి 10 మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. మాజీ పీఏసీఎస్ చైర్మన్లు కంటేపూడి గోపాలరావు, కొమ్మినేని కిషోర్ చేరికతో పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం, గుర్తింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరింత మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
