ప్రపంచాన్ని చుట్టిరావాలనే తన కలను నిజం చేసుకునేందుకు ఓ చైనా వ్యాపారవేత్త ఏకంగా 33 ఏళ్ల పాటు సుదీర్ఘ ప్రయాణం చేశారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 233 దేశాలను సందర్శించిన ఆయన.. తన వరల్డ్ టూర్ కోసం సుమారు 15 లక్షల అమెరికన్ డాలర్లు ఖర్చు చేశారు. భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ.14 కోట్లకు సమానం. ప్రపంచ పర్యటన కోసం ఇంత భారీ మొత్తాన్ని, ఇంత సుదీర్ఘ సమయాన్ని వెచ్చించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

53 ఏళ్ల చెన్ జిన్‌వెయ్ ఇటీవల పెరూలో పర్యటించడంతో తన 33 ఏళ్ల సుదీర్ఘ ప్రపంచ పర్యటనను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న తన ఇంటికి తిరిగి చేరుకున్నారు.
ఎలా మొదలైందంటే..
మెషిన్ల తయారీ కంపెనీని నిర్వహిస్తున్న చెన్ జిన్‌వెయ్ 1993లో సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్ పర్యటనలతో తన ప్రపంచ యాత్రను ప్రారంభించారు. అప్పట్లో ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడంతో.. వివిధ దేశాల్లోని ప్రజల జీవనశైలి, సంస్కృతులు, సంప్రదాయాలను స్వయంగా తెలుసుకోవాలనే ఆసక్తితో ఆయన ప్రయాణాలు మొదలుపెట్టారు.
అయితే వ్యాపారం, కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయకుండా తన ప్రయాణాలను కొనసాగించడం చెన్ ప్రత్యేకత. ఒక నెల ఇంటి వద్దే ఉండి వ్యాపార వ్యవహారాలను చూసుకునేవారు. ఆ తర్వాతి నెలలో మరో దేశానికి పర్యటనకు వెళ్లేవారు. సాధారణ పర్యాటక ప్రాంతాలతో పాటు ప్రతికూల వాతావరణం ఉండే ప్రమాదకర ధ్రువ ప్రాంతాలను కూడా ఆయన సందర్శించారు.
అంటార్కిటికాకు చేరుకోవాలన్న ఆయన తొలి ప్రయత్నం విఫలమైనప్పటికీ, పట్టువదలకుండా 2016 జనవరిలో మరోసారి ప్రయత్నించి అక్కడ అడుగుపెట్టారు. న్యూజిలాండ్‌కు చెందిన మారుమూల ద్వీప భూభాగమైన టోకెలావ్‌కు చేరుకోవడానికి కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు చెన్ తెలిపారు. ఆఫ్రికా పర్యటనలో మలేరియా బారిన పడటంతో పాటు, గ్రీస్‌లో అనూహ్యంగా భూకంపాన్ని కూడా ఎదుర్కొన్నారు.
కేవలం పర్యాటక ప్రాంతాలను సందర్శించి తిరిగి రావడం కాకుండా.. ఆయా ప్రాంతాల స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకుని, అక్కడి ప్రజలతో కలిసి వాటిని అనుభవించడానికే చెన్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలో 198 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లను సేకరించి, వాటిని ‘జు జియాకే మెమోరియల్ హాల్’కు విరాళంగా అందించారు.
33 ఏళ్ల ప్రపంచ పర్యటన పూర్తవడంతో ఇకపై తన పిల్లలు, తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలని చెన్ నిర్ణయించుకున్నారు. అలాగే వివిధ టూరిజం రంగాలకు చెందిన 100 మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి, వారి స్ఫూర్తిదాయకమైన కథనాలతో ఓ పుస్తకాన్ని ప్రచురించాలని ప్లాన్ చేస్తున్నారు.
ప్రయాణమైనా, వ్యాపారమైనా ఒడిదుడుకులు సహజమేనని.. వాటిని ఎదుర్కొంటూనే ముందుకు సాగాలని చెన్ సూచిస్తున్నారు. ప్రయాణాలను వాయిదా వేస్తున్న వారికి ‘సమయం ఎవరి కోసం ఆగదు’ అనే సందేశాన్ని ఇస్తున్నారు.
