నైట్‌షిఫ్ట్ ఉద్యోగాలు మహిళల జీవగడియారంపై ప్రభావం చూపడమే కాకుండా, వారి జన్యు వ్యక్తీకరణలోనూ మార్పులకు దారితీయవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రాత్రివేళ పని చేయడం వల్ల నిద్ర, హార్మోన్ల సమతుల్యత, శరీరంలోని సహజ జీవలయంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ అంశాలపై ఫ్రాంటియర్స్ ఇన్ ఎండోక్రైనాలజీ జర్నల్‌లో తాజాగా ప్రచురితమైన ఒక సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అయితే, జన్యు వ్యక్తీకరణలో మార్పులు చోటుచేసుకోవడం అంటే జన్యువుల నిర్మాణంలో శాశ్వత మార్పులు వచ్చినట్లు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఈ అధ్యయనంలో 37 నుంచి 66 ఏళ్ల వయసున్న 93 మంది మహిళా ఆరోగ్య కార్యకర్తలను పరిశోధకులు ఎంపిక చేశారు. వీరిలో 47 మంది పగటిపూట మాత్రమే విధులు నిర్వహించేవారు కాగా, మరో 46 మంది రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు. వీరందరి నుంచి రక్త నమూనాలను సేకరించిన పరిశోధకులు.. శరీర జీవగడియారాన్ని నియంత్రించే సర్కాడియన్ జన్యువుల పనితీరును విశ్లేషించారు. ఈ సందర్భంగా పగటిపూట పనిచేసే మహిళలతో పోలిస్తే.. రాత్రి షిఫ్టుల్లో విధులు నిర్వహించే వారిలో ఈ జన్యువుల క్రియాశీలత గణనీయంగా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
చాలా ఏళ్లుగా రాత్రి షిఫ్టుల్లో పనిచేస్తున్న మహిళల్లో ఈ మార్పులు మరింత స్పష్టంగా కనిపించినట్లు పరిశోధకులు గుర్తించారు. నైట్ షిఫ్ట్ ఉద్యోగుల్లో నిద్ర పట్ల సంతృప్తి కూడా తక్కువగా ఉందని, ఇది కేవలం 54 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు. మన శరీరంలోని సర్కాడియన్ రిథమ్స్ హార్మోన్ల విడుదల, జీవక్రియ, రోగనిరోధక వ్యవస్థ వంటి కీలక ప్రక్రియలను నియంత్రిస్తాయి. అయితే, నిరంతరం రాత్రివేళల్లో పనిచేయడం వల్ల ఈ సహజ జీవగడియారంలో అంతరాయాలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా మహిళల్లో ఈ ప్రభావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. జీవగడియారానికి సంబంధించిన ఈ అంతరాయాలు జీవక్రియ సమస్యలు, గుండె జబ్బులు, రోగనిరోధక వ్యవస్థ పనితీరులో మార్పులు, కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పుతో సంబంధం కలిగి ఉండవచ్చని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ కూడా హెచ్చరించింది. అందువల్ల నైట్ షిఫ్ట్‌లలో పనిచేసేవారు నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
