బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈదురుగాలులు వీచే సూచనలు ఉండటంతో అధికార యంత్రాంగం హైఅలర్ట్‌లో ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.

సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఆమె తెలిపారు. బుధవారం బాపట్ల విశాఖపట్నం తీరాల మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని ఆ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలి

తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి సూచించారు. ప్రజలకు ప్రమాదం కలిగించే హోర్డింగ్‌లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అవసరమైతే తీరప్రాంత ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్‌ఎఫ్‌) బృందాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు

తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హోంమంత్రి అనిత సూచించారు. బీచ్‌లలోకి పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించాలని అధికారులను ఆదేశించారు. సముద్రంలో భారీ అలలు ఎగసిపడే ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం ఇతర ప్రమాదకర కార్యకలాపాలకు పాల్పడటం వంటివి చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *