
ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. గృహ వినియోగ LPG సిలిండర్ల డెలివరీకి సంబంధించి OTP ధ్రువీకరణ నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. దీంతో వినియోగదారులు OTP లేకుండానే నగదు చెల్లించి సిలిండర్లు పొందవచ్చు.
తుఫాన్ కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో OTP పొందడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఈ వెసులుబాటు కల్పించారు. గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కంపెనీలను కేంద్రం ఆదేశించింది.
తుఫాన్‌తో భారీ నష్టం
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఎనిమిది జిల్లాల్లోని పది మున్సిపాలిటీల పరిధిలో 85 ప్రాంతాల్లో నష్టం జరిగినట్లు మంత్రి నారాయణ తెలిపారు. రోడ్లపై కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించే పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. పారిశుద్ధ్యం, వీధి దీపాల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు.
మరోవైపు తుఫాన్ కారణంగా 64 ఆస్పత్రులు దెబ్బతిన్నాయి. ఏపీఈపీడీసీఎల్‌కు రూ.29.69 కోట్ల నష్టం వాటిల్లింది. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో 5,400 గ్రామాలకు గాను 4,675 గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
మిగిలిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు 8,317 మంది సిబ్బందితో 709 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు కొనసాగుతున్నాయి.
