వంశధార నది వరదలతో ముంపునకు గురైన శ్రీకాకుళం నియోజకవర్గంలోని గార మండలం తాంసాహెబ్‌పేట, కండ్రపేట గ్రామాల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ శుక్రవారం పర్యటించారు. మోకాల్లోతు వరద నీటిలో నడుచుకుంటూ వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ఇళ్లకే పరిమితమైన కుటుంబాలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో బాధితులకు తాగునీరు, ఆహారం, చిన్నారులకు పాలు నిరంతరం అందించాలని అధికారులను ఆదేశించారు.

వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశం

వరదల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, క్లోరినేషన్ మాత్రలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద నీరు తగ్గే వరకు అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *