ఆంధ్రప్రదేశ్‌కు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది. అర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోకముందే మరో అల్పపీడనం వాయుగుండంగా బలపడనుంది. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అనంతరం రెండు రోజుల్లో ఏపీ తీరంవైపు కదిలే అవకాశం ఉందని తెలిపింది.

దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శనివారం ఈ జిల్లాలకు వర్ష సూచన

మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఆదివారం, సోమవారం కూడా వర్షాలు

ఆదివారం కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని అధికారులు తెలిపారు.

సోమవారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *