కాకినాడ జిల్లాలో అర్నబ్ తుఫాన్ కారణంగా జరిగిన నష్టం, బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ హరేందిరప్రసాద్, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి తుఫాన్ నష్టం, పునరుద్ధరణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మత్స్యకారులకు శాశ్వత రక్షణ కల్పించాలి

తీర ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. విపత్తులు వచ్చిన ప్రతిసారీ తాత్కాలిక చర్యలకే పరిమితం కాకుండా శాశ్వత రక్షణ కల్పించాలని సూచించారు.

మత్స్యకారుల వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటానని చెప్పారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డు పునరుద్ధరణ పనులను త్వరగా చేపట్టాలని ఆదేశించారు.

అధికారులకు పవన్ అభినందనలు

తుఫాన్ సమయంలో 92 తీర ప్రాంతాల నుంచి 10 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, 102 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించడంపై అధికారులను పవన్ కళ్యాణ్ అభినందించారు.

మరోవైపు ఈదురు గాలుల కారణంగా పిఠాపురం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంపై ఆరా తీశారు. దెబ్బతిన్న విద్యుత్ వైర్లను త్వరగా మరమ్మతు చేసి సరఫరాను పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు.

తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై అంచనాలను త్వరగా పూర్తి చేయాలని, బాధితులకు సహాయక చర్యలు నిరంతరాయంగా అందించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *