
బెంగళూరులోని యలహంక ఆస్తి విషయంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తన కుమార్తె అంజలి వివాహ వేదికపై షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. యలహంక ప్యాలెస్లో కాకుండా మరో వేదికలో వివాహం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
తన కుమార్తె వివాహాన్ని యలహంక ప్యాలెస్లో జరపాలని భావించినప్పటికీ, ఆస్తి విషయంలో వివాదం తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు షర్మిల తెలిపారు. ఈ మేరకు ఎక్స్ (X) వేదికగా సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. యలహంక ఆస్తి గతంలో ఉమ్మడి ఆస్తిగా ఉండేదని జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆస్తుల పంపకాల్లో భాగంగా అది పూర్తిగా తనకు తన పిల్లలకు చెందిందని షర్మిల పేర్కొన్నారు.
ఈ విషయం దేవుడి సాక్షిగా నిజమని స్పష్టం చేశారు. తన తండ్రి వైఎస్సార్ తిరిగిన ఇల్లు కావడంతో పాటు, తన కుమార్తె అంజలి కోరిక మేరకు అక్కడే వివాహం జరపాలని అనుకున్నట్లు వివరించారు. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని తాను పెరిగిన ఇంట్లోనే పెళ్లి జరగాలన్న కుమార్తె ఆకాంక్షను నెరవేర్చలేకపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
వివాహ వేదిక విషయంలో చోటుచేసుకున్న పరిణామాలపై తన కుమార్తె గురించి ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే పెద్దలు కుదిర్చిన వివాహాన్ని ఎలాంటి వివాదాలు ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాల్సిన బాధ్యత తమపై ఉందని షర్మిల పేర్కొన్నారు.
అందుకే వైఎస్ అంజలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా మరో ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కాబోయే నూతన వధూవరులపై తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
