ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు సవాల్ విసిరారు. అవసరమైతే దీనిపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

శుక్రవారం లక్నోలో జరిగిన ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితాల సవరణ అంశంపై చర్చించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఈ విషయంలో దాచాల్సిందేమీ లేదని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలు పార్లమెంటులో చర్చకు ముందుకు రావడం లేదని సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నాయని విమర్శించారు.

రాహుల్ గాంధీ పార్లమెంటులో ఈ అంశంపై చర్చించకుండా బయట వీధుల్లో ఆందోళనలు చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన ఎన్నికల విజయాలను ఆయన ప్రస్తావించారు. హర్యానా, మహారాష్ట్ర, బిహార్, ఢిల్లీ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలను ఉదహరించారు.

ఎన్నికల్లో గెలవలేమని ప్రతిపక్షాలకు అర్థమైందని అందుకే ఓటమిని అంగీకరించకుండా ఓట్ల చోరీ జరిగిందంటూ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రతిపక్షాలు కూడా పార్లమెంటులో చర్చకు రావాలని అమిత్ షా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *