
అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ హైస్కూలులో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాఠశాల తరగతి గదిలో విద్యార్థినిపై రంపంతో దాడి చేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్య పరిస్థితిపై సీఎం జిల్లా అధికారులను ఆరా తీశారు. ప్రస్తుతం ఆమెకు అందిస్తున్న వైద్య చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థినిపై దాడికి పాల్పడిన నిందితుడిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని జిల్లా పోలీసు అధికారులను చంద్రబాబు ఆదేశించారు. నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
