
D News: Oct 31: ITBPలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. 126 ఖాళీలు
భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 28 క్రీడా విభాగాల్లో అర్హులైన మహిళా, పురుష అభ్యర్థుల నుంచి 126 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్‌బాల్, జూడో, వాలీబాల్ తదితర క్రీడా విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు, వయోపరిమితి.. వేతనం
గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై, 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు ఉన్న క్రీడాకారులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము, ఎంపిక విధానం
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అభ్యర్థుల ఎంపిక ధ్రువపత్రాల పరిశీలన, శారీరక ప్రమాణాల పరీక్ష (PST), స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెరిట్ జాబితా, వైద్య పరీక్షల ఆధారంగా జరుగుతుంది.
దరఖాస్తు తేదీలు
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబరు 3 నుంచి నవంబరు 1వ తేదీ వరకు ITBP అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలని సూచించారు.
