
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 8 పట్టణ స్థానిక సంస్థల్లో చైర్పర్సన్లు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దీంతో మిగిలిన 92 పట్టణ స్థానిక సంస్థల్లో (13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు) పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) మొత్తం 11,705 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 99,36,014 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
13 కార్పొరేషన్లలో మేయర్ పదవుల కోసం 153 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 922 డివిజన్లలో 118 చోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మిగిలిన 804 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ డివిజన్లలో మొత్తం 3,073 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
భారీ పోలీస్ బందోబస్తు డ్రోన్లు, సీసీటీవీలతో నిఘా
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీసు శాఖ విస్తృత ఏర్పాట్లు చేశాయి. భద్రత కోసం మొత్తం 36,351 మంది పోలీసులను మోహరించారు. అదనంగా 3,103 మంది సిబ్బందితో రూట్ మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. 405 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 414 చెక్‌పోస్టులు స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలతో నిఘా కొనసాగిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 941 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మరో 1,788 సమస్యాత్మక కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డ్రోన్లు సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్నికల విధుల్లో మొత్తం 1.5 లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
కూటమి వైసీపీ మధ్య కీలక పోరు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో మున్సిపల్ ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు కూటమి పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు పట్టణ స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు ఆ పార్టీకి కీలకంగా మారాయి.
ముఖ్యంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోని ఆరు మున్సిపాలిటీలు నగర పంచాయతీల చైర్పర్సన్ పదవులతో పాటు కడప నగరపాలక సంస్థలోని 52 డివిజన్లలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
