
మురసు తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంటూ అధికారులను అప్రమత్తం చేశారు.
అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందస్తుగా హెచ్చరించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వాగులు వంకల సమీపంలో ప్రజలు సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
తుఫాన్ కారణంగా తాగునీరు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. ప్రభుత్వం జారీ చేసే హెచ్చరికలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని సహాయక చర్యల్లో అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఉప ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
