అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ యుద్ధాన్ని నివారించేందుకు దౌత్య ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవడంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇరు దేశాలు తమ షరతులపై పట్టుబట్టడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

ఇరాన్‌ మూడు ప్రధాన షరతులు

అమెరికా-ఇరాన్‌ చర్చలకు ఖతార్‌, పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ఇరాన్‌ ప్రతిపాదించిన ఏడు రోజుల ప్రణాళిక ఆధారంగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. అయితే జలసంధిని తెరవాలంటే అమెరికా ముందుగా ఆర్థిక ఆంక్షలను సడలించాలని, నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయాలని, ప్రాంతీయ దాడులను నిలిపివేయాలని ఇరాన్‌ కోరుతోంది.

గతంలోనూ విఫలమైన చర్చలు

గతంలో కుదిరిన అవగాహన ఒప్పందం కొత్త దాడులు, సముద్ర రవాణా వివాదాలతో ముందుకు సాగలేదు. సెప్టెంబర్‌లో ఇరాన్‌ ప్రతిపాదించిన ఏడు రోజుల ప్రణాళికను ట్రంప్‌ తిరస్కరించారు. తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, విదేశాంగ మంత్రి మార్కో రూబియో నుంచి దౌత్య చర్చలకు సానుకూల సంకేతాలు వచ్చినట్లు ఇరాన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

ట్రంప్‌ హెచ్చరికతో టెన్షన్‌

మరోవైపు నవంబర్‌ 3 మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై దాడులు చేసే అవకాశం ఉందని ట్రంప్‌ హెచ్చరించినట్లు సమాచారం. దీంతో చర్చల మధ్యే సైనిక చర్యల ముప్పు కొనసాగుతోంది.

అణు కార్యక్రమమే ప్రధాన అడ్డంకి

ఆంక్షల సడలింపు, దిగ్బంధం తొలగింపు ముందుగా జరగాలని ఇరాన్‌ కోరుతుండగా.. అణు కార్యక్రమంపై చర్చలు జరగాలని అమెరికా పట్టుబడుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు.

చమురు మార్కెట్లపై ప్రభావం

చర్చలు సఫలమై హోర్ముజ్‌ జలసంధి తెరుచుకుంటే అంతర్జాతీయ చమురు సరఫరాకు ఊరట లభిస్తుంది. అదే చర్చలు విఫలమై యుద్ధం మళ్లీ మొదలైతే ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. దీంతో ప్రపంచ దేశాలు తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.

By Ramya