మురసు తుపాను నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించాలని మూడు డిస్కంల సీఎండీలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. తుపాను తీవ్రత అధికంగా ఉండే జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు.

రెవెన్యూ, సచివాలయ, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని స్పష్టం చేశారు. సోమవారం రాజధాని అమరావతిలో మురసు తుపాను సన్నద్ధతపై విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మూడు డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు వీలైనంత వరకు తగ్గించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేందుకు అవసరమైన స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుళ్లు, ఇతర సామగ్రిని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 48 గంటల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన సిబ్బందిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే తెలంగాణ, తమిళనాడు నుంచి అదనపు సిబ్బందితో పాటు యంత్రాలను రప్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గొట్టిపాటి తెలిపారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం 1912 కాల్ సెంటర్‌ను 24 గంటల పాటు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇదే సమయంలో అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల పురోగతిపై కూడా మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ చేపట్టిన మరమ్మతు, పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.

By Rajini