తిరుపతి, ఆంధ్రప్రభ: తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫలితాలు వెలువడే అవకాశం ఉందని తెలిపారు.

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 477 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఒక్కో కట్టలో 25 బ్యాలెట్ల చొప్పున విభజించి, ఇప్పటికే 18 కట్టలను అధికారులు సిద్ధం చేశారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తదుపరి ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.

కౌంటింగ్ కోసం భారీ ఏర్పాట్లు

ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మేయర్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కోసం 35 టేబుళ్లను, కార్పొరేటర్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కోసం 77 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 5,000కు పైగా ఓట్లు ఉన్న 11 డివిజన్లలో రెండు టేబుళ్ల చొప్పున కేటాయించారు. కార్పొరేటర్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపును ఐదు రౌండ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు.

కౌంటింగ్ విధుల్లో 509 మంది సిబ్బంది

ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ కోసం మొత్తం 509 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 121 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 363 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 25 మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నారు. వీరి పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారు.

ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 2,90,492 మంది ఓటర్లు ఉండగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,36,031 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కౌంటింగ్ పూర్తయిన అనంతరం డివిజన్ల వారీగా ఫలితాలను ప్రకటించనున్నారు. ముఖ్యంగా మేయర్ అభ్యర్థి విజయం ఎవరిని వరించనుందనే అంశంపై తిరుపతి నగరంలో ఆసక్తి నెలకొంది.

By Ramya