రాష్ట్రంలో మురసు తుఫాన్ ప్రభావం భారీ వర్షాల పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం గాలుల తీవ్రత ప్రస్తుత పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి దానికి అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి నిర్ణయం డేటా ఆధారంగా ఉండాలని స్పష్టం చేశారు.

ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సగటున 20.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. బాపట్ల జిల్లాలో 21 సెంటీమీటర్లు ప్రకాశం జిల్లాలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.

రేపు ఉదయం వరకు బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలతో రాష్ట్రంలో సగటు వర్షపాతం లోటు 53 శాతం నుంచి 28.9 శాతానికి తగ్గినట్లు తెలిపారు. గత 24 గంటల్లోనే వర్షపాతం లోటు 2 శాతం తగ్గిందని రానున్న ఐదు రోజుల్లో కురిసే వర్షాలతో మరో 2 శాతం తగ్గే అవకాశం ఉందని వివరించారు.

భూగర్భ జలాల పరిస్థితిపైనా అధికారులు కీలక వివరాలు వెల్లడించారు. ఒక్కరోజులోనే భూగర్భ జలమట్టం 0.45 మీటర్ల మేర పెరిగినట్లు తెలిపారు. ఈ వర్షాల ద్వారా సుమారు 20 నుంచి 30 టీఎంసీల నీరు భూగర్భ జలాల్లోకి చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.

అలాగే చెరువులు చిన్న నీటిపారుదల చెరువుల్లోకి సుమారు 10 టీఎంసీల వరకు నీరు చేరి ఉంటుందని అధికారులు తెలిపారు. రిజర్వాయర్లలోకి కూడా 7 నుంచి 8 టీఎంసీల నీరు చేరినట్లు ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం అధికార యంత్రాంగం తక్షణమే స్పందించడం వల్ల విలువైన ప్రాణాలను కాపాడగలిగామని పేర్కొన్నారు. తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులతోనూ ఫోన్‌లో మాట్లాడి సహకారం కోరినట్లు తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు ఆర్టీజీఎస్ వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు నిరంతరం కొనసాగించాలని సీఎం అధికారులకు సూచించారు.

By Rajini