ఆంధ్రప్రదేశ్‌లో 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కూటమి పార్టీలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే 25కుపైగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను కూటమి కైవసం చేసుకుంది. మిగిలిన ప్రాంతాల్లో వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూటమి అభ్యర్థులు పలు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ కొన్ని ప్రాంతాల్లో తన ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా నందికొట్కూరు మున్సిపాలిటీలో 32 వార్డులకు గాను 22 వార్డులను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. అలాగే బేతంచర్ల నగర పంచాయతీలో మొత్తం 28 వార్డులకు గాను 18 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

87 ఛైర్‌పర్సన్ స్థానాల్లో 17 ఏకగ్రీవం

రాష్ట్రవ్యాప్తంగా 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్‌పర్సన్ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ జరగ్గా, 17 స్థానాలు కూటమికి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 70 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో టీడీపీ 49 స్థానాల్లో, జనసేన 17 స్థానాల్లో, బీజేపీ నాలుగు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించాయి. వైఎస్సార్‌సీపీ కూడా మొత్తం 70 స్థానాల్లో పోటీ చేసింది.

ప్రస్తుతం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వారీగా పూర్తి ఫలితాలపై స్పష్టత రానుంది.

By Ramya