చుంచుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చుంచుపల్లి మండలంలోని వాగులు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పెనుబల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గోధుమ వాగుతోపాటు పెనగడప–ములుగుగూడెం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

వాగులపై ఉన్న బ్రిడ్జిల మీదుగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాల నుంచి కొత్తగూడెం పట్టణానికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో పెనుబల్లి వాగు వద్ద స్థానికులు అప్రమత్తమయ్యారు. ఎవరూ వాగు దాటేందుకు ప్రయత్నించకుండా బ్రిడ్జిపై ట్రాక్టర్‌ను అడ్డంగా నిలిపి రాకపోకలను నియంత్రిస్తున్నారు. వరద ఉధృతి తగ్గే వరకు వాగు దాటవద్దని ప్రజలకు సూచిస్తున్నారు.

మరోవైపు, రాకపోకలు నిలిచిపోవడంతో పాలు సరఫరా చేసేవారు, నిత్యావసర వస్తువుల కోసం పట్టణానికి వెళ్లేవారు, కూలీలు, ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు ఇంకా కొనసాగుతుండటంతో వరద ప్రవాహం ఎప్పుడు తగ్గుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో అధికారులు వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టడంతోపాటు, వరద తగ్గే వరకు ప్రజలు వాగులు దాటకుండా అప్రమత్తం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

By Ramya