అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రంగా తెరకెక్కుతున్న ‘కింగ్ 100’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగార్జున నటిస్తున్న 100వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా నుంచి బాలీవుడ్ సీనియర్ నటి టబుకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

టబు పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో ఆమె కనిపించిన తీరు, పాత్ర స్వభావంపై ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మహంతి ఝాన్సీ రాణిగా టబు

‘కింగ్ 100’లో టబు ‘మహంతి ఝాన్సీ రాణి’ అనే కీలక పాత్రలో కనిపించనుంది. విడుదలైన గ్లింప్స్‌లో ఆమె లుక్, బాడీ లాంగ్వేజ్‌తో పాటు డైలాగ్ డెలివరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

“మనుషుల్లో రెండు రకాలు.. కష్టాన్ని నమ్మేవాళ్లు, అదృష్టాన్ని నమ్మేవాళ్లు. మహంతి ఝాన్సీ రాణి అనే నేను..” అంటూ టబు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. అలాగే “హార్డ్ వర్క్, లక్.. ఐ హేట్ లక్” అనే సంభాషణ కూడా పాత్రపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

ఈ గ్లింప్స్‌ను బట్టి చూస్తే టబు పాత్రలో ప్రతినాయక ఛాయలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆమె పాత్ర కథలో ఎలాంటి మలుపులకు కారణమవుతుందో చూడాలి. నాగార్జున 100వ చిత్రంలో టబు కీలక పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.