యూట్యూబ్‌ వీడియోలను చూసి నకిలీ కరెన్సీ తయారీ నేర్చుకున్న ఓ వ్యక్తి, హైదరాబాద్‌ శివార్లలో భారీ నకిలీ నోట్ల దందాకు తెరలేపాడు. కుంట్లూరులో రహస్యంగా ఏర్పాటు చేసిన తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేసి రూ.6.78 కోట్ల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ నకిలీ కరెన్సీ రాకెట్‌ వెలుగులోకి రావడం నగరంలో కలకలం రేపింది.

రామోజీ ఫిల్మ్‌ సిటీ సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో తొలుత రూ.8 లక్షల విలువైన నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా, కుంట్లూరులో కొనసాగుతున్న రహస్య నకిలీ కరెన్సీ తయారీ కేంద్రం గుట్టురట్టయింది.

అంతేకాకుండా, నిందితులు నకిలీ పోలీసుల అవతారమెత్తి బాధితులను బెదిరించి వారి వద్ద ఉన్న అసలు నగదును దోచుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ స్వాధీనం కావడంతో ఈ కేసును పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

సినిమాల్లో కనిపించే నకిలీ కరెన్సీ దందాను ఓ వ్యక్తి నిజ జీవితంలో అమలు చేశాడు. యూట్యూబ్‌, ఇతర సోషల్ మీడియా వీడియోలను చూసి నకిలీ నోట్ల తయారీపై అవగాహన పెంచుకున్నాడు. అనంతరం ఓ ఇంటినే రహస్యంగా నకిలీ కరెన్సీ తయారీ కేంద్రంగా మార్చేశాడు. అయితే పోలీసుల వాహన తనిఖీల్లో నకిలీ నోట్లు పట్టుబడటంతో ఈ భారీ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ శివార్లలో బయటపడిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు మొత్తం రూ.6.78 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.

వాహన తనిఖీలతో వెలుగులోకి వచ్చిన రాకెట్‌!

ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ భారీ నకిలీ కరెన్సీ వ్యవహారం బయటపడింది. ఈ నెల 1వ తేదీన హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై రామోజీ ఫిల్మ్‌ సిటీ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ కారును అడ్డగించి తనిఖీ చేశారు. కారులో రూ.8 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

వెంటనే కారులో ఉన్న ఎం. కరుణాకర్‌, సీహెచ్‌. మాణిక్యరెడ్డి, సీహెచ్‌. రత్నాకర్‌రెడ్డి, కె. అజయ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నకిలీ నోట్ల తయారీ వెనుక భారీ ముఠా ఉన్నట్లు పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో దర్యాప్తును ముమ్మరం చేసి, ఈ అక్రమ దందా వెనుక ఉన్న ఇతర వ్యక్తుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు.

పోలీసుల అదుపులో ఉన్న నలుగురు నిందితులను విచారించగా, కుంట్లూరులో రహస్యంగా నకిలీ కరెన్సీ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి భారీగా నకిలీ నోట్లను గుర్తించారు. ఈ దాడిలో మరో రూ.6.78 కోట్ల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ తయారీకి ఉపయోగిస్తున్న ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌, కరెన్సీ కటింగ్‌ యంత్రాలు, ఇతర పరికరాలను కూడా సీజ్‌ చేశారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడిగా ఉన్న కరుణాకర్‌ యూట్యూబ్‌, ఇతర సోషల్ మీడియా వీడియోలను చూసి నకిలీ కరెన్సీ తయారీపై అవగాహన పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

విచారణలో భాగంగా అసలు రూ.500 నోట్లను డిజిటల్‌గా కాపీ చేసి, వాటిని మార్పులు చేసి నకిలీ కరెన్సీ తయారు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం కుంట్లూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే రహస్యంగా నకిలీ నోట్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.

అయితే ఈ ముఠా నకిలీ నోట్ల ముద్రణ, చలామణీకే పరిమితం కాలేదు. అసలు నగదుతో వచ్చే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. తక్కువ ధరకే నకిలీ కరెన్సీ ఇస్తామని, అసలు డబ్బుకు మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ విలువైన నకిలీ నోట్లు అందిస్తామని ఆశ చూపి బాధితులను ఆకర్షించేవారు. ఈ క్రమంలో అసలు నగదును కాజేసేందుకు ప్రత్యేక పథకం అమలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

బాధితులు నగదుతో ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి చేరుకున్న తర్వాత ఈ ముఠాలోని మరికొందరు నకిలీ పోలీసుల అవతారమెత్తి అక్కడికి వచ్చేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, వాకీటాకీలు, డమ్మీ పిస్టళ్లతో నిజమైన పోలీసుల్లా నటిస్తూ బాధితులను బెదిరించేవారు. నకిలీ కరెన్సీ వ్యాపారం చేస్తున్నారంటూ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించేవారు. దీంతో భయాందోళనకు గురైన బాధితులు తమ వెంట తెచ్చుకున్న అసలు నగదును అక్కడే వదిలేసి వెళ్లిపోయేవారని పోలీసులు గుర్తించారు.

ఇలా ఈ ముఠా ఇద్దరు బాధితులను లక్ష్యంగా చేసుకుని వరుసగా రూ.2 లక్షలు, రూ.3 లక్షలు దోచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. నకిలీ కరెన్సీ తయారీ, చలామణీతో పాటు పోలీసుల వేషంలో బెదిరింపులకు పాల్పడి అసలు నగదును కాజేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరోవైపు పరారీలో ఉన్న జెల్లి వెంకటేష్‌, కుంజ బాలరాజు, కంపసాటి శ్రీనివాస్‌ల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.