
నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 66.6 కి.మీ. రోడ్లు దెబ్బతిన్నాయి
నంద్యాల, నవంబర్ 4 మురసు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రజలకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లపై కూలిన చెట్ల తొలగింపు, ట్రాఫిక్ పునరుద్ధరణ, తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 162.841 కిలోమీటర్ల మేర ప్రధాన జిల్లా, రాష్ట్ర రహదారులు దెబ్బతిన్నాయని బుధవారం వెల్లడించారు.
పలు ప్రాంతాల్లో రహదారులకు నష్టం
తుఫాన్ ధాటికి రహదారుల ఉపరితలాలు దెబ్బతినడంతోపాటు నిర్మాణాలకు నష్టం వాటిల్లిందని మంత్రి వివరించారు. రెండు చోట్ల స్కౌర్స్, నాలుగు ప్రాంతాల్లో రోడ్డు కోతలు, ఐదు చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తూ మరమ్మతులు చేపడుతున్నారని పేర్కొన్నారు.
201 చెట్లు తొలగింపు
తుఫాన్ ప్రభావంతో రహదారులపై కూలిన 201 చెట్లను అధికారులు తొలగించారు. మొత్తం 73 ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, ఇప్పటికే 34 చోట్ల రాకపోకలను పునరుద్ధరించారు. మిగిలిన ప్రాంతాల్లోనూ పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.
నెల్లూరులో అత్యధిక నష్టం
జిల్లాల వారీగా చూస్తే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 66.600 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో 52.683 కి.మీ., పశ్చిమ గోదావరిలో 38.572 కి.మీ., ప్రకాశంలో 3.600 కి.మీ., పల్నాడులో 1.386 కి.మీ. మేర రహదారులకు నష్టం వాటిల్లినట్లు మంత్రి వెల్లడించారు.
