AP Elections 2026: SEC Postpones MPTC, ZPTC Polling in Three Mandals Due to Cyclone Murasu

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక సమీక్ష నిర్వహించింది. మురసు తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణ పరిస్థితులపై జిల్లా కలెక్టర్లతో చర్చించింది. తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల పరిషత్ ఎన్నికలను యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించింది.

గుంటూరు జిల్లాలో మూడు మండలాల్లో పోలింగ్ వాయిదా

గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తుఫాన్ ప్రభావం కారణంగా వాయిదా వేశారు. ఈ మూడు మండలాల్లో ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ వెల్లడించారు.

కలెక్టర్లతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్

విజయవాడలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత రోజు జరిగిన పోలింగ్ విధానం, మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు.

వర్షాలు తగ్గుముఖం పట్టాయని, కొన్ని పరిమిత ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల పోలింగ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్లు ఎస్ఈసీకి వివరించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 5న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎస్ఈసీ అధికారులను ఆదేశించింది.

for more:Mptc zptc election live ubdates in dtv digital channel

పరిస్థితులను బట్టి నిర్ణయాలు

ఎన్నికల నిర్వహణలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే క్షేత్రస్థాయి పరిస్థితులపై కలెక్టర్లు సమర్పించే నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.