
D Spiritual: Nov 5: తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం.. ఏపీ వెలుపలకు విచారణ బదిలీకి సుప్రీంకోర్టు నిరాకరణ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుపలకు బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను తిరస్కరిస్తూ, కేసు విచారణ ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
తిరుమల లడ్డూ కల్తీ కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేసు విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేయాల్సిన అవసరం ప్రస్తుత దశలో లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. మహారాష్ట్రకు చెందిన డెయిరీ పరిశ్రమ వ్యాపారవేత్త, మాల్గంగా మిల్క్ అండ్ అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మచీంద్ర శాంతారాం లంకే ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆయన నిందితుల్లో ఒకరు.
ఆంధ్రప్రదేశ్లో కేసు విచారణకు అనుకూల వాతావరణం లేదని పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వరుసగా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కేసు విచారణ నిష్పక్షపాతంగా సాగడం కష్టమని అభ్యంతరం వ్యక్తం చేశారు. అందువల్ల కేసు విచారణను పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయాలని న్యాయవాది కోరారు.
ఈ వాదనలపై స్పందించిన జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా అలాంటి వ్యాఖ్యలు చేశారా? అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, తమ ఆదేశాలతో సంబంధిత వ్యక్తులందరినీ మౌనంగా ఉండేలా చేశామని పేర్కొన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని వ్యాఖ్యానించారు.
కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయడానికి తగిన కారణాలు కనిపించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుత దశలో విచారణ బదిలీ అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రకటించారు.
ఇదే సమయంలో ఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేపడుతోందని జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అధికార వర్గాలు లేదా రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు, ప్రకటనల వల్ల సీబీఐ విచారణ ప్రభావితం కాదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు విచారణ ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగనుంది.
