ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు పక్షపాత ధోరణితో జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

కృష్ణా జిల్లా గన్నవరంలోని స్థానిక జడ్పీ హైస్కూల్‌లో వంశీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరుపై విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు.

మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని వంశీ విమర్శించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వ్యాఖ్యానించారు.

For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital

మరోవైపు ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనే అవకాశాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వల్లభనేని వంశీ కోరారు.