
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే తెలంగాణ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. ఇకపై ఉద్యోగాలకు అప్లై చేసే సమయంలో మైగ్రేషన్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో మాత్రం తాము నిర్దేశిత గడువులోగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చినట్లు ధ్రువీకరించే పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే తెలంగాణ అభ్యర్థులకు దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చిన అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో మైగ్రేషన్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ సర్టిఫికెట్ లేకపోయినా అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించాలని సాధారణ పరిపాలన శాఖ (GAD) ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు డీఎస్సీ, ఏపీపీఎస్సీ, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు, పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది. దీంతో మైగ్రేషన్ సర్టిఫికెట్ కారణంగా దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ అభ్యర్థులకు ఊరట లభించనుంది. అయితే తదుపరి సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం పదేళ్ల కాలపరిమితిని పరిగణనలోకి తీసుకుని, 2024 జూన్ 1వ తేదీ నాటికి లేదా అంతకంటే ముందే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చిన అభ్యర్థులకు ఈ నిబంధన వర్తించనుంది. అయితే తాము నిర్ణీత గడువులోగా తెలంగాణ నుంచి ఏపీకి వచ్చినట్లు సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో తగిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు, కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రాతిపదికన స్థానికత సర్టిఫికెట్లు జారీ చేసే అంశంపై ప్రభుత్వం నుంచి మరిన్ని మార్గదర్శకాలు రావాల్సి ఉంది. కొత్త జిల్లాల పరిధిలో స్థానికతను ఎలా నిర్ధారించుకోవాలనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థలు దరఖాస్తు చేసుకునే సమయంలోనే మైగ్రేషన్ సర్టిఫికెట్ సమర్పించాలనే నిబంధనను అమలు చేస్తున్నాయి. దీంతో తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన అభ్యర్థులు దరఖాస్తు దశలోనే పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మైగ్రేషన్ సర్టిఫికెట్ సమర్పణ విషయంలో వెసులుబాటు కల్పించింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం దరఖాస్తు సమయంలో ఈ సర్టిఫికెట్ అవసరం లేకపోవడంతో వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఊరట లభించనుంది.
జాతీయ స్థాయి ప్రవేశ, అర్హత పరీక్షల నిర్వహణలో పారదర్శకతతో పాటు పటిష్ఠ భద్రత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే నీట్, జేఈఈ మెయిన్, సీయూఈటీ, యూజీసీ నెట్ పరీక్షల కోసం జిల్లా స్థాయి సమన్వయ కమిటీలను పునర్నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర, జిల్లా స్థాయి సమన్వయ కమిటీల్లోని పలువురు అధికారులు బదిలీ కావడం, పదవీ విరమణ చేయడంతో కొత్తగా కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్లు ఈ కమిటీలకు అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. గతంలో పరీక్షలు నిర్వహించిన కేంద్రాల పనితీరు, వాటి నిర్వహణ బాధ్యతలు చేపట్టిన యాజమాన్యాల వివరాలను కమిటీలు పరిశీలిస్తాయి. అంతేకాకుండా ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నిర్వహించే విద్యాసంస్థల్లోనే పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయనున్నారు.
పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సంయుక్తంగా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తారు. ప్రశ్నపత్రాలను సురక్షితంగా తరలించడం, పరీక్షలు పూర్తయిన తర్వాత ఓఎంఆర్ షీట్లు, సమాధాన పత్రాలను భద్రంగా సంబంధిత కేంద్రాలకు చేర్చడం వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బలగాలతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్యల ద్వారా జాతీయ స్థాయి పరీక్షలను పారదర్శకంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
