హిందూపురంలో ఓ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారి బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో నగదు జమ అయినట్లు వచ్చిన మెసేజ్ కలకలం రేపింది. తోట ఆనంద్ అనే వ్యాపారి బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.1,000 కోట్లు జమ అయినట్లు మొబైల్‌కు సందేశం అందింది. అయితే ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కేవలం అరగంట వ్యవధిలోనే బ్యాంకు ఖాతాలో నిల్వ సున్నాగా కనిపించడంతో ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

వెంటనే బ్యాంకుకు వెళ్లిన ఆనంద్ ఖాతాలో జరిగిన లావాదేవీలపై అధికారులను ఆరా తీశారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు ఆయన ఖాతాలోకి అంత భారీ మొత్తం ఎలా జమ అయింది? కొద్దిసేపటికే నగదు నిల్వ ఎందుకు మాయమైంది? సాంకేతిక లోపమా లేక మరేదైనా కారణమా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఓ వ్యాపారికి అనూహ్యమైన అనుభవం ఎదురైంది. ఆయన బ్యాంకు ఖాతాలో ఒక్కసారిగా ఏకంగా రూ.1,000 కోట్లు జమ అయినట్లు సమాచారం అందడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అంత భారీ మొత్తం తన అకౌంట్‌లోకి ఎలా వచ్చిందో అర్థంకాక అయోమయానికి గురయ్యారు. అయితే ఈ వ్యవహారం ఎంతోసేపు కొనసాగలేదు. కేవలం అరగంట వ్యవధిలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఖాతాలో జమ అయినట్లు కనిపించిన రూ.1,000 కోట్లు మాయమవడమే కాకుండా, అంతకుముందు ఉన్న నగదు నిల్వ కూడా కనిపించకుండా పోయినట్లు వ్యాపారి చెబుతున్నారు. దీంతో ఆందోళనకు గురైన ఆయన వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించి వివరాలు కోరారు. అనంతరం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తన ఖాతాలోకి వచ్చినట్లు కనిపించిన భారీ మొత్తం సంగతిని పక్కనపెడితే, కనీసం తన సొంత డబ్బులైనా తిరిగి అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అసలు ఈ ఘటన వెనుక సాంకేతిక సమస్య ఉందా? మరేదైనా కారణమా? అన్నది తెలియాల్సి ఉంది.

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని సదాశివనగర్‌కు చెందిన తోట ఆనంద్ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయనకు ఓ ప్రైవేట్ బ్యాంకులో ఖాతా ఉంది. మంగళవారం మధ్యాహ్నం ఆయన మొబైల్‌కు బ్యాంకు నుంచి ఓ సందేశం వచ్చింది. అందులోని వివరాలను పరిశీలించగా తన ఖాతాలో భారీ మొత్తంలో నగదు జమ అయినట్లు కనిపించింది. వెంటనే బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేయగా, మొదట సుమారు రూ.32 వేల వరకు ఉన్న నగదు నిల్వ ఒక్కసారిగా ఏకంగా రూ.1,000 కోట్లకు చేరినట్లు గుర్తించారు. దీంతో తన ఖాతాలోకి ఇంత భారీ మొత్తం ఎలా వచ్చిందో తెలియక ఆనంద్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని తన స్నేహితులకు కూడా చూపించారు.

అయితే ఈ ఘటనలో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారీ మొత్తంలో నగదు జమ అయినట్లు కనిపించిన అరగంటలోపే ఆయన బ్యాంకు ఖాతా బ్యాలెన్స్ సున్నాకు పడిపోయింది. దీంతో అప్పటివరకు ఖాతాలో ఉన్న రూ.32 వేలకు పైగా సొమ్ము కూడా కనిపించకుండా పోవడంతో ఆనంద్ ఆందోళనకు గురయ్యారు. వెంటనే సంబంధిత బ్యాంకు శాఖకు వెళ్లి జరిగిన విషయంపై సిబ్బందిని ఆరా తీశారు. అయితే అక్కడి నుంచి సరైన సమాచారం లభించకపోవడంతో నేరుగా హిందూపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

తన ఖాతాలోకి వచ్చినట్లు కనిపించిన రూ.1,000 కోట్ల సంగతి పక్కనపెడితే, అప్పటికే ఉన్న తన సొంత డబ్బులు సైతం ఎలా మాయమయ్యాయన్నది ఆనంద్ ప్రశ్నిస్తున్నారు. అసలు ఖాతాలోకి అంత భారీ మొత్తం ఎలా కనిపించింది? ఆ తర్వాత బ్యాలెన్స్ సున్నాగా ఎందుకు మారింది? దీని వెనుక సాంకేతిక లోపం ఉందా లేక మరేదైనా కారణమా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ వింత బ్యాంకింగ్ వ్యవహారం ప్రస్తుతం హిందూపురంలో చర్చనీయాంశంగా మారింది.