టీమిండియా స్టార్ బ్యాటర్, ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లి నేడు తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులు, సహచర ఆటగాళ్లు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు స్టార్ స్పోర్ట్స్ కోహ్లితో ప్రత్యేకంగా ‘విన్నర్ స్టేస్ ఆన్’ ఛాలెంజ్ వీడియోను రూపొందించింది. ఇందులో తన కెరీర్‌లో అత్యంత ఇష్టమైన వన్డే ఇన్నింగ్స్ ఏదో కోహ్లి వెల్లడించారు.

2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనలే బెస్ట్

తన కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై చేసిన 43 పరుగుల ఇన్నింగ్స్‌ను తన అత్యుత్తమ వన్డే ప్రదర్శనగా పేర్కొన్నారు. వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో కోహ్లి, రవీంద్ర జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరూ కలిసి 47 పరుగులు జోడించడంతో భారత జట్టు పోరాడే స్కోరు సాధించగలిగింది.

చివరకు భారత్ ఐదు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఆడిన ఇన్నింగ్స్ తనకు ఎంతో ప్రత్యేకమని కోహ్లి గుర్తుచేసుకున్నారు.

కోహ్లికి ధావన్, రైనా శుభాకాంక్షలు

విరాట్ కోహ్లి పుట్టినరోజు సందర్భంగా పలువురు మాజీ క్రికెటర్లు ఆయనకు ప్రత్యేక సందేశాలు పంపించారు. మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్, సురేశ్ రైనా తమ అభినందనలు తెలియజేశారు.

“పుట్టినరోజు శుభాకాంక్షలు కోహ్లి! ఆట పట్ల నీకున్న అభిరుచి, పట్టుదల, ప్రేమ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. రాబోయే ఏడాది అద్భుతంగా గడవాలి బ్రో!” అని శిఖర్ ధావన్ పేర్కొన్నారు.

మరోవైపు సురేశ్ రైనా కూడా కోహ్లిపై ప్రశంసలు కురిపించారు. “హ్యాపీ బర్త్‌డే, కింగ్ కోహ్లి! నీ అద్భుతమైన కవర్ డ్రైవ్స్ నుంచి మరపురాని ఛేజింగ్‌ల వరకు క్రికెట్ అభిమానులకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించావు. నీ పోరాట పటిమ, గెలవాలనే తపన నిన్ను ప్రత్యేకంగా నిలబెడతాయి. నీ బ్యాటింగ్‌ను ఎంతో ఆస్వాదిస్తాను. మరిన్ని విజయాలు సాధిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలి” అని రైనా ఆకాంక్షించారు.