చంద్రగిరి నియోజకవర్గంలో ఘర్షణలు, నిరసనలు.. ఆరు కేసులు నమోదు చేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు, నిరసనలు చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలపై పలువురిని అరెస్ట్ చేయడంతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు.. పలువురి అరెస్ట్
తిరుపతి రూరల్ మండల పరిధిలోని కపిలేశ్వరస్వామి స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణకు దిగిన వెంకటపతి నగర్‌కు చెందిన బొర్రెడ్డివారి గజేంద్రనాథ్ రెడ్డి, కోనేరు ప్రసాద్ రెడ్డిలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
అలాగే సాయినగర్ పంచాయతీలోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లతో గొడవపడుతూ ఉద్రిక్తతకు కారణమయ్యారనే ఆరోపణలతో శశిధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
చంద్రగిరి మండలం అగరాల గ్రామంలోని ఎంపీపీఎస్ స్కూల్ వద్ద వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఎన్నికల వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలతో వైఎస్సార్సీపీ నాయకుడు తుకాకుల దేవరాజుల రెడ్డిని పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు.
చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు తొమ్మిది మందిపై కేసు
చంద్రగిరి టవర్ క్లాక్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కోటాల చంద్రశేఖర్ రెడ్డి, మల్లం చంద్రమౌళి రెడ్డితో పాటు మరో ఆరుగురు నిరసన చేపట్టారు.
కోటాల, నరసింగాపురం, అగరాల, ఐతేపల్లి, రామిరెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానాల్లో రీ-పోలింగ్ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. అయితే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాకపోకలకు అంతరాయం కలిగించారనే ఆరోపణలపై తొమ్మిది మందిపై సీఆర్ నంబర్ 289/2026 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
స్కార్పియో వాహనంపై దాడి.. 12 మందిపై కేసు
మరోవైపు ఆర్సీపురం మండలం కాలేపల్లి గ్రామంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. సురవారిపల్లెకు చెందిన పి. వాసుదేవ రెడ్డి ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనాన్ని కొందరు అడ్డుకుని, ఆయనను బయటకు లాగి కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది.
ఈ ఘటనలో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. సుమారు రూ.30 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు ఎం. యశ్వంత్, ఎం. ధనంజయ రెడ్డితో పాటు మొత్తం 12 మందిపై ఆర్సీపురం పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ.. నలుగురి అరెస్ట్
ఎర్రవారిపాలెం జెడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణలకు దిగారనే ఆరోపణలతో పి. హేమంత్ కిషోర్ రెడ్డి, సి. గంగిరెడ్డి, వై. వెంకటరెడ్డి, పి. శివప్రసాద్‌లను వై.వి.పాలెం పోలీసులు అరెస్ట్ చేశారు.
For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital
ఆరు కేసులు.. 29 మందిపై చర్యలు
ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తిరుపతి జిల్లా పోలీసులు హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మొత్తంగా తిరుపతి రూరల్, చంద్రగిరి, ఆర్సీపురం, వై.వి.పాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్నికల ఘర్షణలు, నిరసనలకు సంబంధించి ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో మొత్తం 29 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
