
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 365 కేంద్రాల్లో అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియలో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం బ్యాలెట్ బాక్సులను తెరిచి సాధారణ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కౌంటింగ్ ప్రారంభమైన నాలుగు గంటల తర్వాత తొలి ఫలితాలు వెలువడే అవకాశం ఉండగా, జడ్పీటీసీ స్థానాల ఫలితాలు మధ్యాహ్నం తర్వాత వెల్లడయ్యే అవకాశముంది. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత
ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా కొనసాగించనున్నారు. పోలీసు సిబ్బంది బాడీ వోర్న్ కెమెరాలతోనూ పరిస్థితులను పర్యవేక్షించనున్నారు.
MPTC, ZPTC ఓట్ల లెక్కింపు ఇలా..
బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను ఎంపీటీసీ ఓట్లుగా, తెలుపు రంగు పత్రాలను జడ్పీటీసీ ఓట్లుగా గుర్తిస్తారు. ఈ రెండు రకాల బ్యాలెట్ పత్రాలను వేర్వేరుగా విభజించి, 25 చొప్పున కట్టలుగా ఏర్పాటు చేస్తారు. అనంతరం వాటిని లెక్కింపు ప్రక్రియకు పంపిస్తారు.
కౌంటింగ్ కోసం మొత్తం 9,062 టేబుళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో 50 శాతం టేబుళ్లపై జడ్పీటీసీ ఓట్లు, మిగిలిన 50 శాతం టేబుళ్లపై ఎంపీటీసీ ఓట్లు లెక్కిస్తారు. ప్రతి రౌండ్లో ఒక్కో టేబుల్‌పై 1,000 బ్యాలెట్ పత్రాలను లెక్కించనున్నారు.
ఈ ప్రక్రియ కోసం 11,002 మంది సూపర్వైజర్లు, 28,692 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందిని నియమించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత రిటర్నింగ్ అధికారి పరిశీలించి, అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తారు.
21 వేల మందికి పైగా అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. వీటిలో 77 జడ్పీటీసీ స్థానాలు, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు నిర్వహించిన ఎన్నికల ఓట్లను ప్రస్తుతం లెక్కిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 21,012 మంది అభ్యర్థుల గెలుపోటములు నేడు తేలనున్నాయి. దీంతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి ప్రజలు ఎక్కువ స్థానాలు కట్టబెట్టారనే విషయం తుది ఫలితాలతో స్పష్టంకానుంది.
