
మచిలీపట్నం, కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ శనివారం సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న తీరును, కేంద్రంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. కౌంటింగ్ కేంద్రంలోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే సిబ్బందికి కేటాయించిన విధులు, రికార్డుల నిర్వహణ, ఓట్ల లెక్కింపు వేగంపై సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా పూర్తయ్యేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
