కర్నూలు, కర్నూలు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. కర్నూలు ప్రభుత్వ ఫర్‌మెన్ డిగ్రీ కళాశాలలో కోడుమూరు మండలానికి సంబంధించిన ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు.

జిల్లాలోని పలు మండలాల పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శించారు. వెల్దుర్తి, కోసిగి, మంత్రాలయం, ఓర్వకల్లు, మద్దికెర, పత్తికొండ మండలాల్లో టీడీపీ ఆధిక్యంలో నిలవగా, కల్లూరు ఎంపీటీసీ, కోడుమూరు, చిప్పగిరి స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉంది.

మరోవైపు ఆదోని, ఆదోని-2 జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో జనసేన ఆధిక్యం సాధించింది. కృష్ణగిరిలో స్వతంత్ర అభ్యర్థికి అత్యధిక ఓట్లు లభించాయి. హాలహర్విలో టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు చెరో నాలుగు ఓట్లు వచ్చాయి.

కోడుమూరు మండలంలో వైసీపీకి 55 ఓట్లు, టీడీపీకి 41 ఓట్లు రావడంతో వైసీపీ 14 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. అలాగే పత్తికొండ జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీకి 83, వైసీపీకి 32 ఓట్లు పోలయ్యాయి. ఆదోని జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్‌లో జనసేనకు 33, వైసీపీకి 25 ఓట్లు వచ్చాయి.

ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మండలాల వారీగా భిన్న ఫలితాలు వెలువడుతుండగా, సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతోంది. తుది ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయన్న ఉత్కంఠ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల్లో నెలకొంది.

By Ramya