
కొంత కాలంగా రియల్ ఎస్టేట్ పరంగా దూసుకెళ్తున్న హైదరాబాద్.. ఇప్పుడు సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తుంది. లగ్జరీ హౌసింగ్ మార్కెట్ సెగ్మెంట్లో దక్షిణ భారతదేశంలోనే హైదరాబాద్ గత ఆర్థిక సంవత్సరంలో టాప్‌లో నిలిచింది. రూ. 10 కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన ఇళ్ల అమ్మకాలు హైదరాబాద్‌లోనే ఎక్కువ జరగడం విశేషం. విలువ పరంగా చూస్తే బెంగళూరు కంటే ఏకంగా 4 రెట్లు అధికంగా హైదరాబాద్ నుంచే వచ్చింది.
ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరులో చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 128 అల్ట్రా లగ్జరీ హౌసింగ్ యూనిట్లే అమ్ముడుబోగా.. దీని విలువ రూ. 1957 కోట్లుగా ఉంది. దీని కంటే హైదరాబాద్ లగ్జరీ ఇళ్ల విక్రయాల విలువ 4 రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. సంఖ్యా పరంగా కూడా దాదాపు 5 రెట్లు ఎక్కువగా ఉంది. ఇక చెన్నైలో 58 అల్ట్రా లగ్జరీ యూనిట్లు విక్రయించగా వీటి విలువ కేవలం రూ. 727 కోట్లుగా ఉంది.
బెంగళూరు, చెన్నైతో పోలిస్తే రూ. 10 కోట్లు అంతకంటే ఎక్కువ వెచ్చిస్తే.. హైదరాబాద్‌లో లగ్జరీ ఇళ్లు ఎక్కువ విస్తీర్ణంతో అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడ సేల్స్ పెరిగినట్లు తెలుస్తోంది. రూ. 10 కోట్ల పెట్టుబడికి హైదరాబాద్ నగరంలో సుమారు 6,210 చదరపు అడుగుల విశాలమైన ఇళ్లు లభిస్తుండటం కారణం. రూ. 10 కోట్ల ధరకు చూస్తే.. బెంగళూరు కంటే హైదరాబాద్ నగరంలో దాదాపు 60 శాతం ఎక్కువ స్పేస్ లభిస్తుందని రిపోర్ట్ చెప్పడం గమనార్హం.

