1.5 మీటర్లకు చేరిన వరద నీటి మట్టం..
సహాయం కోసం 2,166 మంది బాధితుల విజ్ఞప్తులు

గాజా, ఆంధ్రప్రభ: గాజాలో కురుస్తున్న భారీ వర్షాలు నిరాశ్రయుల జీవితాలను మరింత దుర్భరంగా మార్చాయి. వర్షపు నీరు భారీగా చేరడంతో నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన సుమారు 70 వేల టెంట్లు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో వరద నీటి మట్టం 1.5 మీటర్లకు చేరడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో పౌర రక్షణ అధికారులు అత్యవసర అప్రమత్తత ప్రకటించారు.

వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి అత్యవసర సాయం కోసం పౌర రక్షణ విభాగం కంట్రోల్‌ రూమ్‌లకు 2,166 ఫోన్‌ కాల్స్‌ అందాయి. అయితే పరిమిత వనరులు, భారీగా సహాయం కోరుతున్న బాధితుల సంఖ్య కారణంగా సహాయక బృందాలు కేవలం 218 ప్రాంతాలకే చేరుకోగలిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అవసరమైన ప్రత్యేక పరికరాలు, వాహనాలను గాజాలోకి అనుమతించేలా ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకురావాలని అధికారులు కోరారు. నిరాశ్రయులైన కుటుంబాలకు టెంట్లు, ప్లాస్టిక్‌ షీట్లు, మొబైల్‌ ఇళ్లను అందించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

మధ్య గాజాలోని నుసైరాత్‌ నిరాశ్రయుల శిబిరంలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. భారీ వర్షపు నీరు టెంట్లలోకి చేరడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బలమైన ఈదురుగాలులకు కొన్ని టెంట్లు కూలిపోవడంతో శిబిరం మొత్తం బురదమయంగా మారింది. ఇప్పటికే యుద్ధం కారణంగా నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు ప్రకృతి వైపరీత్యం రూపంలో మరో విపత్తు ఎదురైంది. కనీస వసతులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *