
D Spiritual: Nov 9: తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా, అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను బంగారు వాకిలి వద్ద గల గరుడాళ్వారు సన్నిధిలో వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. స్వామివారు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. అనంతరం ప్రసాద నివేదనలు సమర్పించారు. మూలవిరాట్టుతో పాటు ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలను సమర్పించి, రూపాయి హారతి, ప్రత్యేక హారతులు నిర్వహించడంతో దీపావళి ఆస్థానం ముగిసింది.
ఈ సందర్భంగా టీటీడీ సాధికార మండలి ఛైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ.. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి భక్తులతో పాటు ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులతో పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, పిల్లలు, ఆప్తులతో కలిసి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయంలో ఉగాది, ఆణివార ఆస్థానం, దీపావళి, శ్రీరామనవమి, గోకులాష్టమి వంటి పర్వదినాల సందర్భంగా ఆస్థాన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆగమ సంప్రదాయాలను అనుసరిస్తూ వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి కృపతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ భక్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, సీవీఎస్వో మురళీకృష్ణతో పాటు పలువురు టీటీడీ అధికారులు పాల్గొన్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక ఆస్థాన వేడుకలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించాయి.
