D Educt: Nov 10: పదో తరగతి సమ్మెటివ్‌-1 పరీక్షలకు ప్రత్యేక పరిశీలకులు

రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి సమ్మెటివ్‌-1 పరీక్షల పర్యవేక్షణకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఉపాధ్యాయులను పరిశీలకులుగా నియమించింది. పాఠశాల స్థాయి పరీక్షలకు పరిశీలకులను నియమించడం ఇదే తొలిసారి. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలకు, పాఠశాల స్థాయి పరీక్షల ఫలితాలకు మధ్య వ్యత్యాసం ఉంటుండటంతో పరీక్షలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా సమ్మెటివ్‌-1 పరీక్షలు నవంబరు 9న ప్రారంభమై 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొదటి మూడు రోజులు జరిగే భాషా సబ్జెక్టుల పరీక్షలకు భాషేతర స్కూల్‌ అసిస్టెంట్లను, భాషేతర సబ్జెక్టుల పరీక్షల సమయంలో భాషా సబ్జెక్టుల ఉపాధ్యాయులను పరిశీలకులుగా నియమించారు. వీరు పరీక్షల నిర్వహణతో పాటు జవాబు పత్రాల మూల్యాంకనం, లీప్‌ యాప్‌లో మార్కుల నమోదును కూడా పర్యవేక్షించనున్నారు.

పరిశీలకులుగా పొరుగు మండలాలకు చెందిన ఉపాధ్యాయులను నియమించినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో 15 కిలోమీటర్లకు మించి ప్రయాణించాల్సి వస్తోందని ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రత్యేక పరిస్థితుల్లో మండల పరిధిలోని ఉపాధ్యాయులనే పరిశీలకులుగా నియమించే వెసులుబాటును జిల్లా విద్యాశాఖాధికారులకు (డీఈఓ) కల్పించింది. పరిశీలకులు విధులకు హాజరవుతున్నారా లేదా అనే విషయాన్ని తనిఖీ చేసే బాధ్యతలను జిల్లా నోడల్‌ అధికారులకు అప్పగించింది.

వారం రోజుల్లో మూల్యాంకనం పూర్తి

పరీక్ష పూర్తయిన మూడు పని దినాల్లో సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు పాఠశాలలోనే జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలి. ప్రతి విద్యార్థి మార్కులను రిజిస్టర్‌లో నమోదు చేయాలి. జవాబు పత్రాలు, మార్కుల రిజిస్టర్లు ప్రధానోపాధ్యాయుడి ఆధీనంలో ఉంటాయి. మూల్యాంకనం పూర్తయిన నాలుగో రోజున అదే సబ్జెక్టుకు చెందిన మరో పాఠశాల ఉపాధ్యాయుడిని పరిశీలకుడిగా నియమిస్తారు.

నియమిత పరిశీలకుడు మూల్యాంకన ప్రక్రియను పరిశీలించడంతో పాటు మొత్తం జవాబు పత్రాల్లో 5 శాతం లేదా కనీసం ఐదు పత్రాలను తనిఖీ చేస్తారు. తనిఖీలో ఎలాంటి లోపాలు కనిపించకపోతే లీప్‌ యాప్‌లో మార్కుల నమోదుకు అనుమతిస్తారు. ఈ ప్రక్రియను ఏడు రోజుల్లోగా పూర్తి చేయాలి. తనిఖీలో గుర్తించిన అంశాలతో అదేరోజు మండల విద్యాశాఖాధికారులకు (ఎంఈఓ) నివేదిక సమర్పించాలి.

పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, జవాబు పత్రాల తనిఖీ, లీప్‌ యాప్‌లో మార్కుల నమోదు.. ఇలా ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేకంగా గడువులను పాఠశాల విద్యాశాఖ నిర్దేశించింది. పరీక్షలు నవంబరు 18న ముగియనుండగా, అన్ని ప్రక్రియలను 27వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *