
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన కథ, పాత్రల గురించి సోషల్ మీడియాలో అనేక ఆసక్తికరమైన ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న ‘కుంభ’ పాత్ర నేపథ్యంపై తాజాగా ఓ కొత్త కథా సిద్ధాంతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
కుంభకర్ణుడి పునర్జన్మగా ‘కుంభ’?
సోషల్ మీడియా వేదిక రెడ్డిట్లో ప్రచారంలో ఉన్న ఓ థియరీ ప్రకారం.. సినిమాలో పృథ్వీరాజ్ పోషిస్తున్న కుంభ పాత్రకు రామాయణంలోని కుంభకర్ణుడితో సంబంధం ఉండొచ్చని తెలుస్తోంది. కుంభకర్ణుడి పునర్జన్మగా ఈ పాత్రను చూపించనున్నారనేది ఈ ఊహాగానాల సారాంశం.
రావణుడికి సంబంధించిన నవరత్నాల హారాన్ని సొంతం చేసుకోవడమే కుంభ లక్ష్యమని ఈ కథనంలో పేర్కొంటున్నారు. అందులోని తొమ్మిది శక్తివంతమైన రత్నాలను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించేందుకు రుద్ర పాత్రలో నటిస్తున్న మహేశ్ బాబును కుంభ ఉపయోగించుకుంటాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమా కథ పలు దేశాలు, విభిన్న ప్రాంతాల్లో సాగుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
రామాయణ కాలానికి వెళ్లనున్న మహేశ్ బాబు?
‘వారణాసి’ కథలో టైమ్ ట్రావెల్ అంశం కూడా కీలకంగా ఉండొచ్చని మరో ఆసక్తికరమైన థియరీ వైరల్ అవుతోంది. కథానాయకుడు ఓ వార్మ్హోల్ ద్వారా రామాయణ కాలంలోకి ప్రయాణిస్తాడని, రాముడు-రావణుడి మధ్య జరిగిన యుద్ధ సమయంలో చోటుచేసుకున్న కొన్ని కీలక సంఘటనల్లో జోక్యం చేసుకుంటాడని ఈ కథనం చెబుతోంది.
గతంలో జరిగిన పరిణామాలను మార్చడం వల్ల నవరత్నాలకు సంబంధించిన భవిష్యత్తు కూడా మారుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలు నిజమైతే ‘వారణాసి’లో పురాణ గాథతో పాటు సైన్స్ ఫిక్షన్ అంశాలు కూడా మిళితమై ఉండే అవకాశం ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు.
అధికారిక వివరాల కోసం ఎదురుచూపులు
అయితే కుంభ పాత్రకు కుంభకర్ణుడితో సంబంధం ఉందనే ప్రచారం, టైమ్ ట్రావెల్ ట్విస్ట్ వంటి అంశాలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఊహాగానాలు మాత్రమే. చిత్ర బృందం వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి రాజమౌళి తనదైన శైలిలో ఈ కథను ఎలా తెరకెక్కించనున్నారు? మహేశ్ బాబు, పృథ్వీరాజ్ పాత్రల మధ్య ఎలాంటి సంఘర్షణ ఉండబోతోంది? అనే విషయాలు తెలియాలంటే అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
