ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి, ఆధునిక సాంకేతిక రంగాల విస్తరణ ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా ఏవీజీసీ-ఎక్స్ఆర్ (AVGC-XR) పాలసీ 2026-31తో పాటు ఏపీ రోబోటిక్స్ ఫిజికల్ ఏఐ విధానాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ సెమీకండక్టర్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 2024-29 ముసాయిదా సవరణలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంబంధించి పలు కీలక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో ఏఎం ఇంటెలిజెన్స్ (AM Intelligence) సంస్థ ఆధ్వర్యంలో రూ.31,387 కోట్ల పెట్టుబడితో 512 మెగావాట్ల సామర్థ్యం కలిగిన గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

అదేవిధంగా విజయనగరం జిల్లా భోగాపురంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు సుమారు 25 ఎకరాల భూమి కేటాయించేందుకు నిర్ణయించింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో రూ.4,000.20 కోట్ల పెట్టుబడితో కార్బన్ కాస్మో బ్యాటరీ మెటీరియల్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

తిరుపతిలో రూ.700 కోట్ల పెట్టుబడితో డిక్సన్ టెక్నాలజీస్ యూనిట్ ఏర్పాటుకు స్థల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.570.20 కోట్లతో ఈపాక్ (Epack) సంస్థ ఏఐ డేటా సెంటర్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,565 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటిరో గ్రూప్‌కు చెందిన ఫార్మా సంస్థల కోసం 173.82 ఎకరాల భూమి కేటాయింపునకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.236.92 కోట్ల పెట్టుబడితో రవళి స్పిన్నర్స్ విస్తరణ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా 1,569 మందికి ఉపాధి లభించనుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో 30 ఎకరాల్లో ఫిక్కీ ఫ్లో (FICCI FLO) ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *