
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మకు కార్తీక శుద్ధ విదియ, భగినీ హస్త భోజనం సందర్భంగా ప్రత్యేక అలంకరణ చేశారు. సుమారు 8 లక్షల రంగురంగుల సప్తవర్ణ గాజులతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ అపురూప అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవ విగ్రహం, మహామండపం, ఉపాలయాల్లోని అమ్మవారి విగ్రహాలకు కూడా గాజులతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు.
భగినీ హస్త భోజనం ప్రత్యేకత
భగినీ హస్త భోజనం సందర్భంగా సోదరులు తమ సోదరీమణుల ఇళ్లకు వెళ్లి కానుకలు అందించడం సంప్రదాయం. యమధర్మరాజు తన సోదరి యమునకు కానుకలు సమర్పించిన పురాణగాథ ఈ పర్వదినానికి నేపథ్యంగా చెబుతారు. ఈ సంప్రదాయంలో భాగంగా 2016 నుంచి ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి గాజులతో అలంకరణ చేస్తున్నారు.
ఈ ఏడాది పలువురు దాతలు సుమారు 8 లక్షల గాజులను దేవస్థానానికి విరాళంగా అందించారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఈ గాజులను ఉచితంగా ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. రంగురంగుల గాజులతో అలంకరించిన అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించుకుని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
